ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే-దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం- సీ.ఎం చంద్రబాబు
హైదరాబాద్: ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే..తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలపడమే ధ్యేయం. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారని,, తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పుస్తకం ఉందని సీఎం కొనియాడారు.
అజాత శత్రువు దత్తన్న:- ‘జెంటిల్ మేన్ ప్రతిరూపం దత్తాత్రేయ, ఆయనకు విరోధులు అంటూ ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే,సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగిన తీరు ఆదర్శనీయం. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం నాకు సంతోషంగా ఉంది. 40 ఏళ్ల నాటి పాతరోజులు నాకు గుర్తొచ్చాయి.ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకూ దత్తాత్రేయ సేవలు అందించారు. సాధారణ స్వయం సేవక్ నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలున్నాయి. దత్తాత్రేయ పేరుకే హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకున్నది జనహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అలయ్ బలయ్‌తో ఐకమత్యం:-దత్తాత్రేయ ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.. ఆ కార్యక్రమాన్ని ఐక్యమత్యానికి వేదికగా చేశారు. దత్తాత్రేయకు విరోధులు ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు, ఆదర్శ రాజకీయ జీవితం అంటే బండారు దత్తాత్రేయ గుర్తొస్తారు. “ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండవం చేసి లక్షలాదిమందిని తుడిచిపెట్టేసిన దృశ్యాలు చూస్తానని కానీ, అక్కడ శవాలను ఏరుతూ, బతికున్న వారి దాహార్తి తీరుస్తూ కొన్ని వారాలపాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకుముందెప్పుడూ ఊహించలేదు’ అని ఆయన ఆత్మకథలో రాశారు. ఆ మాటలు ఆయన జీవితంలో చేసిన సేవలను తెలియజేస్తాయన్నారు.