AGRICULTUREAP&TGOTHERS

సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ- మంత్రి నాదెండ్ల మనోహర్

దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం..

అమరావతి: రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, పారదర్శకత, సాంకేతికత, వేగవంతమైన సేవల సమన్వయంతో సివిల్ సప్లైస్ శాఖ గత రెండు సంవత్సరాల్లో చారిత్రాత్మక సంస్కరణలను అమలు చేసి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆహార-పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, ధాన్యం కొనుగోళ్లలో సంపూర్ణ పారదర్శకత, తక్షణ చెల్లింపులు, మధ్యవర్తుల నిర్మూలన, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు, రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు అనుబంధ శాఖల సమన్వయంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

రైతుకు ప్రథమ ప్రాధాన్యత:- ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 17.97 లక్షల మంది రైతుల నుండి 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో సుమారు రూ.30,361 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు నిర్వహించి, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం జరిగిందన్నారు.

దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం:- రైతులకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ఆధారిత ధాన్యం నమోదు మరియు విక్రయ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 40 వేల మందికి పైగా రైతులు ఈ విధానాన్ని వినియోగించుకుని సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేరుగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు విక్రయించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణ ద్వారా మధ్యవర్తుల జోక్యం గణనీయంగా తగ్గడమే కాకుండా, రైతులకు పారదర్శక వ్యవస్థలో నేరుగా లాభం చేకూరిందని  ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె.కన్నబాబు,  సివిల్ సప్లైస్  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డిల్లీ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *