బ్రిక్స్ అనేది ఒక ‘అత్యంత ప్రత్యేకమైన కూటమి’- అజిత్ దోవల్
అమరావతి: ఢిల్లీలో మంగళవారం 16వ బ్రిక్స్ (BRICS) జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ కూటమి ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండడం పట్ల ఢోబాల్ ఆనందం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అనేది ఒక ‘అత్యంత ప్రత్యేకమైన కూటమి’ అని,కూటమిలోని సభ్య, భాగస్వామ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన పాత్ర ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అనిశ్చితులు నెలకొన్న సమయంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
సైనిక ఘర్షణలు, సంక్లిష్టమైన భద్రతా సమస్యలు:- ప్రస్తుతం కూటమి, ఒక అత్యంత క్లిష్టసమయంలో సమావేశం అయ్యాము. ప్రపంచం ప్రస్తుతం సైనిక ఘర్షణలు, సంక్లిష్టమైన భద్రతా సమస్యలతో సతమతమవుతోంది. భౌగోళిక, రాజకీయ, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, విఘాతం కలిగించే డిస్రప్టివ్ టెక్నాలజీ లాంటి సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.వీటి వల్ల ముప్పులు పెరగడమే కాదు, ఈ ఘర్షణలను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల వల్ల కావడం లేదన్నారు. బహుపక్షవాదం (Multilateralism) కూడా క్షీణిస్తోంది అని ఢోబాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
మల్టీపోలార్ ప్రపంచం:- ప్రపంచ పాలనలో బ్రిక్స్ పాత్ర మారుతోందని,అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించండానికి, గ్లోబల్ సౌత్ తమ గళాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక వేదికగా మొదటిసారి ఈ బ్రిక్స్ రూపొందించబడిందని వెల్లడించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం కోసం సంస్థాగత సంస్కరణలు, సహకార విధానానికి ఈ కూటమి కట్టుబడి ఉందన్నారు.”బహుళ ధ్రువ ప్రపంచం (Multipolar world)” కోసం, అభివృద్ధి చెందుతున్న దేశాల అనధికారిక కూటమిగా ఈ బ్రిక్స్ ప్రారంభమైందన్నారు. ఆర్థిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ సౌత్ గొంతుకను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.

