అజిత్ దోవల్,జైశంకర్ తో చర్చలు జరిపిన ఉక్రెయిన్ జాతీయ భద్రత-కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్
అమరావతి: సంఘర్షణలతో అట్టుడికిపోతున్న దేశంలో “శాశ్వత శాంతిని సాధించే” అవకాశాలపై ఉక్రెయిన్ జాతీయ భద్రత-రక్షణ మండలి కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్ శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్-జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో వేర్వేరుగా, అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సంప్రదింపులు, దౌత్యం ద్వారా శాంతిమార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటింది. సంఘర్షణలతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని నెలకొల్పాల్సిన అవసరాన్ని భారత్ ప్రస్తావించింది. ఈ భేటీతో అంతర్జాతీయంగా విభేదాలను తగ్గించగల ప్రపంచ దౌత్యశక్తిగా ఢిల్లీ ఎదుగుతోందని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ ఉన్నతాధికారి, జెలెన్స్కీ సన్నిహితుడైన ఉమెరోవ్, రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితులు, చర్చల పురోగతి, యుద్ధాన్ని ఆపి శాశ్వత శాంతిని నెలకొల్పే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం.

