AP&TG

‘సాస్కి నిధులు కేటాయించండి’,నిర్మలా సీతారామన్‌ను కోరిన చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రెండో రోజూ హస్తినలో పర్యటించిన ముఖ్యమంత్రి సాస్కి నిధుల అంశంపై నిర్మలా సీతారామన్‌తో సమావేశమై చర్చించారు. అదేవిధంగా కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతోనూ భేటీ అయిన చంద్రబాబు అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మలా సీతారామన్‌తో భేటీ:- దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీకి ఆర్థిక సాయాన్ని కోరారు. సాస్కి కింద అదనంగా రూ.10,000ల కోట్లు కేటాయించాలని ఆమెకు సీఎం విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలన్నారు. అమరావతికి రెండో విడత నిధులను గ్రాంట్​గా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి అమరావతి, పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ:- అంతకుముందు కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. రాజధానిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయకు సీఎం వివరించారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్రీడల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరంలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పనకు వినతిపత్రం సమర్పించారు. కాకినాడ, నరసరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం కోరారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.

గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు గ్రాంట్లు ఇవ్వాలని మన్​సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు అవుతుందని చెప్పారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తింపునకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్​లో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు మాండవీయకు వివరించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *