సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో 5 చోట్ల NIA సోదాలు-నిందితులు అరెస్ట్
రామగుండంలోని ఇంజినీరింగ్ విద్యార్థి..
ఆపరేషన్ సిందూర్ సమయంలో..
భారత ప్రభుత్వానికి చెందిన 54 వెబ్సైట్లపై..
అమరావతి: గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.2025 జూన్ 25వ తేదిన గుజరాత్ నమోదైన సైబర్ టెర్రరిజం కేసుకు RC-01/2025/NIA/AMD సంబంధించి ఈ సోదాలు జరిగాయని సంబంధిత శాఖ అధికారి పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని పుణే జిల్లా జున్నార్, గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాద్, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం, బీహార్లోని గోపాల్గంజ్, ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నిందితులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.
రామగుండంలోని అయోధ్యనగర్ లో NIA సోదాలు నిర్వహించింది. ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ అరెస్ట్ చేసిన NIA అధికారులు, NTPC పోలీసు స్టేషన్ లో ముజామిల్ ఖాన్ను ప్రశ్నించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీసిన అధికారులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో సైబర్ దాడుల కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.?
భారత ప్రభుత్వానికి చెందిన 54 వెబ్సైట్లపై:- ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వానికి చెందిన 54 వెబ్సైట్లపై అత్యాధునిక డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. దేశ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు భంగం కలిగించడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులకు ప్రయత్నించినట్లు NIA తెలిపింది.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్:- ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తొలుత ఈ కేసును గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ ద్వారా అరెస్టయిన నిందితులకు సైబర్ దాడులకు పాల్పడేందుకు శిక్షణ, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధిలో సహకరించినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను NIA గుర్తించింది.
హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించి:- సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం సోమవారం వారి ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించినట్లు భావిస్తున్న పలు డిజిటల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
డిజిటల్ పరికరాలను స్వాధీనం:- మొత్తంగా 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లతో పాటు ఇతర డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అరెస్టయిన నిందితులతో వారి సంబంధాలపై విచారించడం జరిగిందని, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని NIA అదికారులు వెల్లడించారు.

