రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం-ఐబీ
అమరావతి: ఢిల్లీలో జనవరి 26వ తేదిన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశంలో ఎక్కడైన ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నందున, భద్రతా సంస్థలు రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాద్ తో సహా పలు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) హెచ్చరించింది. సదరు నగరాల్లోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిపే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.దింతో భద్రత దళాలు,పోలీసులు ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50,000 మందికి పైగా పోలీసులు, 65 కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీలో మోహరించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది.

