ప్రణాళిక బద్ధంగా రాష్ట్రంను అభివృద్ధి చేస్తున్నాం-మంత్రి నారాయణ
నెల్లూరు: స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని, దీనికనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెంట రాగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను ఎగరవేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందిస్తూ, శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా మన ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ల మేరకు ప్రణాళిక బద్ధంగా అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను మంత్రి తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన:- పోలీసు కవాతు మైదానంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, డ్వామా, నెల్లూరు నగరపాలక సంస్థ, గృహనిర్మాణశాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ, జిల్లా విద్యాశాఖ, వ్యవసాయశాఖ, జిల్లా అగ్నిమాపకశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ, రోడ్లు, భవనములశాఖలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించేలా రూపొందించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యాశాఖ శకటానికి ప్రథమ స్థానం:- విద్యావ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ చక్కగా ప్రదర్శించిన విద్యాశాఖ, సమగ్రశిక్షశాఖకు ప్రథమస్థానం, నెల్లూరు నగరపాలకసంస్థకు ద్వితీయస్థానం, వ్యవసాయ అనుబంధశాఖలకు తృతీయ బహుమతులు లభించాయి. ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్ జ్ఞాపికలను అందజేశారు.
విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు:- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభచూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లాస్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.