ఘనంగా వివేకానంద జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
నెల్లూరు: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని,క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సేవాభావంతో యువత ముందుకు సాగితే భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని వివేకానంద స్పష్టంగా చెప్పారని జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి, గుర్తు చేశారు.సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక ములుముడు బస్టాండ్లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మేర యువ భారత్ నెల్లూరు మరియు NSS సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయమైన మహానీయుడని తెలిపారు. ఆయన బోధనలు నేటి యువత జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకాలని అన్నారు. అనంతరం NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అల్లం ఉదయ్ శంకర్ మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా బలంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మేర యువ భారత్, NSS వాలంటీర్లు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

