విద్యార్థులు మంచి క్రీడాకారులుగా రాణించాలి-బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన భాస్కర్ రెడ్డి
నెల్లూరు: యువతలో మానసి ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, మంచి క్రీడాకారులుగా రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో యోనెక్స్-సన్ రైస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను టిడిపి రాష్ట్ర నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు. విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ యోనెక్స్ సన్ రైస్ సంస్థ సహకారంతో సబ్ జూనియర్ అండర్ 15 బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.