2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేద్దాం-కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని నిరక్షరాస్యులైన వయోజనులను గుర్తించి, వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి, 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో స్వయం సహాయక బృందాలకు శిక్షణ తరగతులను శుక్రవారం నిర్వహించారు.
అక్షర ఆంధ్ర:- ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశాల మేరకు “అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ” (ULLAS) అమలులో భాగంగా అక్షర ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమం అమలులో భాగంగా నగర వ్యాప్తంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వయోజన విద్య అందించాల్సిన వ్యక్తుల వివరాలను సేకరించాలని సూచించారు. మెప్మా విభాగం నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయడంతో పాటు, పి 4 కార్యక్రమం అమలులో భాగంగా మార్గదర్శకులుగా మారిన ప్రజల నుంచి స్వచ్ఛందంగా బోధన అందించే వ్యవస్థను రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఉల్లాస్ మొబైల్ యాప్:- గుర్తించిన ప్రజలందరికీ వయోజన విద్యకు అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఉల్లాస్ మొబైల్ యాప్, దీక్ష పోర్టల్ తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. సమీక్షా సమావేశంలో అడల్ట్ ఎడ్యుకేషన్ నోడల్ ఆఫీసర్ మస్తాన్ రెడ్డి, అర్బన్ ఎమ్.ఈ.ఓ. తిరుపాలు, మెప్మా ఏ.ఓ సుధాకర్, సూపర్వైజర్ లు రాజశేఖర్, కృష్ణ కిషోర్, స్వయం సహాయక బృందాల సభ్యులు, మెప్మా ఆర్.పి లు పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమం అమలు కోసం 8 అభ్యాసాలపై ట్రైనర్లు నారాయణ రెడ్డి , శ్రీకాంత్ లు అవగాహన కల్పించారు.