పారిశ్రామికవేత్తలు రీసైక్లింగ్ యూనిట్ల స్థాపనకు ముందుకురావాలి-కలెక్టర్ హిమాన్షు శుక్ల
ప్రతిరోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలు..
నెల్లూరు: వ్యర్థాలను విలువైన సంపదగా మార్చేందుకు జిల్లాలో రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0పై పారిశ్రామికవేత్తలకు జిల్లా పరిశ్రమలశాఖ, పర్యావరణ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
నెల్లూరులో ప్రతిరోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలు:- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ ప్రతిరోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలను నెల్లూరు నగరపాలక సంస్థ సేకరిస్తుందని, ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్ల ద్వారా విలువైన సంపదగా తయారుచేయవచ్చన్నారు. పారిశ్రామికవేత్తలందరూ రీసైక్లింగ్ యూనిట్ల స్థాపనకు ముందుకురావాలని, ప్రభుత్వపరంగా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీలు, అనుమతులు సకాలంలో అందించి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. రీసైక్లింగ్ ప్లాంట్ల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మన ప్రాంతమంతా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్చాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగానే సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థ రీసైక్లింగ్ పాలసీ 4.0 (2025-30)ను ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు.
పలువురు పారిశ్రామికవేత్తలు రీసైక్లింగ్ యూనిట్ల స్థాపనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ.నందన్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్‌కుమార్, పరిశ్రమలశాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.