అనధికార నిర్మాణాలపై ఛార్జ్ షీట్లు దాఖలు చేయండి-కమిషనర్ వై.ఓ. నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా చేపట్టే అనధికార నిర్మాణాలు, అనుమతులను అతిక్రమించి చేపట్టే అక్రమ కట్టడాలను గుర్తించి, సంబంధిత యజమానులపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసి నోటీసులు జారీ చేయాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుమతులకు విరుద్ధంగా నగరంలో నిర్మించిన అన్ని భవనాలకు చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. చార్జిషీట్లలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరిచి, దాఖలా అనంతరం తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఛార్జ్ షీట్ ఆధారంగా కోర్టు మంజూరు చేసిన సమన్లను అక్రమ నిర్మాణాల భవన యజమానులకు స్వయంగా అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయం పరిధిలోని అనధికార లేఔట్లను నిర్మాణ స్థాయిలోనే గుర్తించి, అనుమతులు లేని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనధికార నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు సంబంధించిన కోర్టు కేసుల వాయిదాల సమయంలో క్రమం తప్పకుండా కౌంటర్లు దాఖలు చేస్తూ, పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ వేణు, డిపిఓ రఘు నాథ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.