ఉపాధ్యాయురాలిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
విశిష్ట ధైర్యశాలి అవార్డుకు..
నెల్లూరు: ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలు హరితను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం పరామర్శించారు. బాలాయపల్లి మండలం గొట్టికాడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పండిత హరిత, గురువారం గూడూరు నుండి బాలాయపల్లికి టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరితను కలెక్టర్ పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు.
భారత ప్రభుత్వానికి సిఫారసు:- వైద్యులతో మాట్లాడిన కలెక్టర్, ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరంగా తెలుసుకున్నారు. తీవ్ర కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలపగా, కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డ్రైవర్ దాడి సమయంలో ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తిస్తూ, విశిష్ట ధైర్యశాలి అవార్డు కోసం భారత ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపారు.నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్న కలెక్టర్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. బాలాజీ రావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

