జిల్లాలో 9 నూతన ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS) రైతులకు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టడీస్ వారి సూచనల మేరకు జిల్లాలో 9 నూతన ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని, దీంతో రైతులు వాతావరణ అంచనాల ఆధారంగా పంటల సాగు, ఎరువుల వినియోగం, పురుగుమందుల పిచికారీ వంటి వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే తుఫానులు, భారీ వర్షాలు వంటి విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఏఎస్ఓ ఏవి రమేష్, సాంకేతిక నిపుణులు తదితరులు ఉన్నారు.

