AP&TG

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది-పవన్ కళ్యాణ్

రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు…

అమరావతి: ‘వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదనీ, లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె:- తిరుమలలో అపచారం చేశారు. నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్ది కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారు. రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారు. తమకేమీ తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ చేసిన అపరాచాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్లాలి.

అదుపు తప్పిన మాటలే దాడులు చేసేలా చేస్తున్నాయి:- వైసీపీ నాయకులంటే నాకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదు. వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లల్లోకి వస్తాం… దాడులు చేస్తాం… నరికేస్తాం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. దాడులను, హింసను ఏ రాజకీయ పార్టీ సమర్థించదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పదేపదే చెబుతున్నారు. అలా జరిగితే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనీ హెచ్చరించారు. మనం ప్రజలకు చెప్పే మంచి వెళ్లే లోపు వైసీపీ నాయకులు జనాల్లో భయం క్రియేట్ చేస్తున్నారు. మళ్లీ మేము వస్తే అంటూ రకరకాలుగా బెదిరింపు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయింది. అయినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదు. ప్రజలు చాలా తెలివైనోళ్లు. వాళ్లు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

జనసేన ఒక కులానికి, కుటుంబానికి చెందిన పార్టీ కాదు:- జనసేన పార్టీ ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. కులాలకు అతీతంగా పార్టీ బలోపేతంపై అంతా దృష్టి సారించాలి. ఎన్నికల సమయంలో ఎలా అయితే ప్రజల్ని కలిసి అందుబాటులో ఉన్నామో ఇప్పుడూ అలానే ఉండాలి. మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలి. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో ప్రతీ నాయకుడు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలి. పార్టీ ఆవిర్భావ దినం మార్చి 14న జెన్ జి డే ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *