AP&TG

మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా…

అమరావతి:  ‘మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్..  మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

ఇళ్లకు వెళ్లే ముందే ఆర్థిక సాయం:- మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం.  కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నాం. ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ.3 వేలు చెల్లించనున్నాం. తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *