AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం-ఈవో సింఘాల్

తిరుపతి: డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దర్శనానికి సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి, ‘ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన టోకెన్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానాన్ని సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

శ్రీవాణి ట్రస్టు నిధులతో:- తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. మరోవైపు, శ్రీవాణి ట్రస్టుకు అందిన రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో 5 వేల భజన మందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారం, కల్యాణ మండపం, రాజగోపురం వంటి అభివృద్ధి పనులను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *