దేశీయ విమానయాన రంగంలోకి మూడు కొత్త సంస్థలు-కేంద్ర మంత్రి
అమరావతి: విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో 3 కొత్త విమాన సంస్థలు అందుబాటులోకి రానున్నాయి. శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ అనే మూడు కొత్త విమానయాన సంస్థలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు.
మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులపై గత వారం రోజులుగా ఈ కొత్త ఎయిర్‌లైన్స్ బృందాలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ మూడు సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించిందన్నారు. ఈ అనుమతులతో ఈ కంపెనీలు తమ విమానాలను ప్రయాణికులకు సేవాలు అందించేందుకు అధికారిక సన్నాహాలు మొదలుపెట్టనుయన్నారు.
కొత్త సంస్థల రాకతో:- భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నవిమానయాన మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో UDAN పథకం ద్వారా చిన్న నగరాలను సైతం ఎయిర్ నెట్వర్క్ లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఇప్పటికే స్టార్ ఎయిర్. ఇండియావన్ ఎయిర్, ఫ్లై 91 వంటి సంస్థలు ప్రాంతీయంగా సేవలు అందిస్తుండగా ఈ కొత్త సంస్థల రాకతో కనెక్టివిటీ మరింత బలోపేతం కానున్నదని వెల్లడించారు.
టికెట్ల ధరలు తగ్గే అవకాశం:- మార్కెట్లో పోటీ పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికులు తమకు నచ్చిన సమయంలో నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు.దేశ ఆర్థిక పురోగతిలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని, మరిన్ని సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి రామ్ మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త విమానయాన సంస్థలు:-
శంఖ్ ఎయిర్– ఉత్తరప్రదేశ్ తొలి షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్. దీని ప్రధాన కేంద్రాలు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో. వారణాసి, గోరఖ్‌పూర్ వంటి నగరాల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు తమ సేవలను అందించనుంది.ఈ సంస్థ కొత్త తరం బోయింగ్ 737-800 విమానాలను ఉపయోగించనున్నాయి.
అల్ హింద్ ఎయిర్– ఈ ఎయిర్ లైన్ దక్షిణ భారతంలో సేవాలు అందించనున్నది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అల్ హింద్ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ కేరళలోని ఇంటీరియర్ ప్రాంతాలను బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తన సేవలను అందించనుంది.
ఫ్లైఎక్స్ ప్రెస్– మధ్య భారత్, ఇతర ప్రాంతీయ మార్గాల్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. రీజినల్ కనెక్టివిటీ అందించే ఉడాన్ పథకంకు ఇది ఊతం ఇవ్వనున్నది.

