AP&TGEDU&JOBSOTHERS

విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యత-సీ.ఎం చంద్రబాబు

తల్లి పేరిట ఒక మొక్క..

అమరావతి:  విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు సీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముందు జెడ్పీ పాఠశాలలో విద్యార్ధులతో ముచ్చటించారు. రాష్ట్రంలో రెండో సారి విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందిస్తున్నానని అన్నారు. గురు పౌర్ణమి రోజునే రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్ల మందితో ఈ సమావేశం నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందని.. ఇది గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కుతుందన్నారు.

తల్లి పేరిట ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నాం. మొక్కను సంరక్షిస్తూ పురోగతి నమోదు చేసేలా గ్రీన్ పాస్ పోర్టు కూడా ఇచ్చాం. విద్యార్ధుల హాజరు, మార్కులు, ప్రవర్తన ఇలా అన్ని అంశాలను లీప్ యాప్ ద్వారా అందిస్తున్నాం.  విద్యార్ధులకు నాణ్యమైన యూనిఫాం, బూట్లు, బెల్టు, బ్యాగ్ లు ఇచ్చాం. విద్యార్ధులకు ఇచ్చిన కిట్లపై ఎలాంటి రాజకీయ నేతల ఫోటోలు పెట్టలేదు. విద్యార్థి కిట్ల కోసం రూ. 980 కోట్లు వ్యయం చేశాం. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం.” అని అన్నారు.

విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 2.0లో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ తో కలిసి కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో విద్యార్ధులు- వారి తల్లి తండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తొలుత పాఠశాల ఆవరణలో విద్యార్ధులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపోందించిన ఫొటో ఫ్రేమ్ లో సీఎం మంత్రి లోకేష్ , ఎన్సీసీ కేడెట్లతో కలిసి ఫోటో దిగారు.

విద్యార్ధులతో కింద కూర్చుని భోజనం:- ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులంతా ముఖ్యమంత్రి సమక్షంలో తమ తల్లులకు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొత్త చెరువు జెడ్పీ పాఠశాల ఆవరణలో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి కింద కూర్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరగించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతం అక్కడే విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న బోజనాన్ని తిన్నారు. పాఠశాలలో విద్యార్ధులకు పెడుతున్న ఆహార పదార్ధాల నాణ్యత, రుచి బాగుందని సీఎం కితాబిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *