ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు-సిఎస్ విజయానంద్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు మొదటి సమావేశం గురువారం ఎపి సచివాలయంలో జరిగింది. ఈసమావేశంలో ఎపిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈఅడ్వయిజరీ కమిటీ చర్చించింది.ముఖ్యంగా 2030 నాటికి ఎపిని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో ఎపి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రకటించడం తోపాటు ప్రత్యేకంగా ఒక అడ్వయిజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.2027 నాటికి 2 గిగావాట్ ఎలెక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పర్చడం,2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) గీన్ హైడ్రోజన్” ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోందని వెల్లడించారు.

