రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించిన పవన్
అమరావతి: గత ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంత రాయలు కుటుంబాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం పరామర్శించారు. పెడన నియోజకర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. చందు, భార్య శ్రీమతి నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ఓదార్చారు.బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితుల్లో వున్న వసంత రాయలు అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందజేసే రూ.5 లక్షల బీమా చెక్కు పవన్ కళ్యాణ్ అంద చేశారు. అలాగే చందు, కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతోపాటు మాటలు రావని తెలుసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు నుంచి సాయం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మేల్యే కాగిత కృష్ణప్రసాద్, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, అవనిగడ్డ ఎమ్మేల్యే మండలి బుద్దప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,పార్టీ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

