తీవ్రఅల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో శనివారం మోస్తరు నుంచి భారీ-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది శుక్రవారం రాత్రి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో శనివారం కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు,, తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.
శనివారం:- కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, నెల్లూరు, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.