AP&TG

ఖరీఫ్‌ 2025-26 పంటకు ఈనెల 15 నుంచి సాగునీటిని విడుదల-ఐఏబీ

నెల్లూరు: జిల్లాలో ఖరీఫ్‌ 2025-26 సంవత్సరానికి ఈనెల 15వ తేదీ నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు IAB సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ వెల్లడించారు. శనివారం ఉదయం నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధ్యక్షతన నిర్వహించారు.

5 లక్షల ఎకరాలకు 50 TMCలు:- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి చల్లనిచూపు చూడడంతో ఈ ఏడాది జిల్లాలోని జలశయాలు, చెరువులు, పంటకాలువల్లో పుష్కలంగా నీరు వుందన్నారు. సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ మేరకు జిల్లాలో 2025-2026 ఖరీప్‌ సాగుకు సంబంధించి సుమారు 5 లక్షల ఎకరాలకు 50 TMCల నీటిని విడుదల చేసేందుకు, కండలేరు జలాశయం నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా 2,23,333 ఎకరాలకు 22.333 TMCల నీటిని మొత్తం సుమారు 7.30 లక్షల ఎకరాలకు 73 TMCల నీటి కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, సభ్యులందరూ ఆమోదం తెలపాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించారు. ఇందుకు అందరూ ఆమోదం తెలిపారు. ఈ మేరకు నీటి కేటాయింపులకు ఐఎబి సమావేశం ఆమోదించినట్లు ఇన్‌చార్జి మంత్రి ఫరూక్‌ పేర్కొన్నారు.

రైతుకు కూడా ఇబ్బందులు లేకుండా:- సోమశిల జలాశయం పరిధిలోని పెన్నార్‌డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువ, జికెఎన్‌ కాలువ, దక్షిణకాలువలకు, కండలేరు జలాశయం పరిధిలోని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కెఆర్‌ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌, యస్‌యస్‌జి కెనాల్‌ (నెల్లూరు,తిరుపతి)కు సాగునీటి, తాగునీటి అవసరాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి ఫరూక్‌ చెప్పారు. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు లేకుండా సాగునీటి కేటాయింపులు జరిపినట్లు చెప్పారు.

లష్కర్లకు జీతాలు:- తొలుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కనుపూరు కాలువ కింద ఆయకట్టును కచ్చితంగా లెక్కించి సాగునీటిని విడుదల చేయాలని సూచించారు. సోమశిల ఆఫ్రాన్‌ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ లష్కర్లకు జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని, కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయించాలని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. గండిపాలెం ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ కూడా పట్టించుకోవడం లేదని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, మెట్టప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఇరిగేషన్‌ పనులు జరిగేలా చూడాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.  కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఆయా నియోజకవర్గాల్లో పలు ఇరిగేషన్‌ మెయింటెనెన్స్‌ పనులు త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రులు-ఎమ్మేల్యేలు:- ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, బీద మస్తాన్‌ రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, తూమాటి మాధవరావు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్‌, కష్ణా రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *