నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా-చంద్రబాబు
జలాలే మన సంపద..
అమారవతి: ‘పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. జలాలే మన సంపద.. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు నాలుగు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
నిండిన ప్రాజెక్టును చూస్తే:- నా జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తుంటే మనసు ఆహ్లాదంగా ఉంది. భవిష్యత్తులో నీటి కొరత ఉండకుండా ఉండేందుకు కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామం. నీటితో రాయలసీమ జలాశయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నింపొచ్చు. రోజుకు 17 టీఎంసీల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ కూడా నిండింది. అని సీఎం చంద్రబాబు అన్నారు.
గంగమ్మను పూజిస్తే కరవు ఉండదు:- భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని నా సంకల్పం నెరవేరాలని మొక్కుకున్నా. రాయలసీమ రతనాలసీమగా మార్చాలని వేడుకున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. నీళ్లు మన సంపద..జలాలుంటే సందప సృష్టించుకోవచ్చు. శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం… శక్తి పీఠం. మల్లికార్జున స్వామి చల్లగా చూసినన్ని రోజులు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి:- ‘నేను రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటా. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్-1గా ఉండాలనేది నా అభిమతం. గత ప్రభుత్వం ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. చెడిపోయిన వ్యవస్థలను సరిచేస్తున్నా. అయినా 24 గంటల సమయం సరిపోవడం లేదు. వరదల సమయంలో సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుంది’ అని సీఎం ఆకాంక్షించారు.