రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు-అప్రమత్తంగా ఉండాలి-సీ.ఎం రేవంత్ రెడ్డి
అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు…
హైదరాబాద్: ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు కాజ్‌వేలు, ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలపై వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలని సీఎం సూచించారు.. ఎక్కడైనా ప్రమాదవశాత్తూ చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. రానున్న 72 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని… అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది..ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని… క్లౌడ్ బస్టర్స్‌తో ఊహించనంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు. క్లౌడ్ బస్టర్ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్దం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్ నగరంలో:- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ఎంఏయూడీ.. ప్రతి విభాగం సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఐటీ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించి వర్క్ ఫ్రం హోం.. సెలవుల విషయమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.