రాజమహేంద్రవరం నార్త్,సౌత్ ఎక్సైజ్ స్టేషన్లలో పూర్తి సిబ్బంది బదలీ-ఎక్సైజ్ శాఖ కమీషనర్
అమరావతి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రెండు ఎక్సైజ్ స్టేషన్లలోని సిబ్బందిని సమూలంగా మార్చుతూ ఎక్సైజ్ శాఖ కమీషనర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రెండు ముఖ్య ఎక్సైజ్ స్టేషన్లలో సిబ్బంది పనితీరుపై పలు మార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేకపోవటంతో గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం నార్త్, సౌత్ స్టేషన్లలో గత సమీక్షలలో వారి పనితీరు సక్రమంగా లేకపోవడం, రెండు అవకాశాలు ఇచ్చినప్పటికీ అవసరమైన మార్పు చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్లలో ఉన్న మొత్తం సిబ్బందిని ఇతర యూనిట్లకు బదిలీ చేసి, పూర్తిగా కొత్త సిబ్బందిని నియమించారు.

