AP&TG

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి.. వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తంగా 21 కేటగిరీల బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులతో కలిపి మొత్తంగా 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయల ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దివ్యాంగుల శక్తి పథకానికి సంబంధించిన ఈ నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. పథకం ప్రారంభించిన సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి రాజధానిలోని పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో ప్రయాణించిన నేతలు.. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను.. కార్యక్రమాలను వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *