రోడ్ల నిర్మాణంలో 4 గిన్నిస్ రికార్డులు సృష్టించడం అభినందనీయం-గడ్కరీ,చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథార్టీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్‌పై ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి. అసాధారణ ఇంజినీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం చంద్రబాబు NHAI అధికారులకు, రాష్ట్ర యంత్రాంగానికి, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
6 రోజుల్లోనే 156 కిలోమీటర్లు:- NHAI, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ ఆధ్వర్యంలో 6 రోజుల్లోనే 156 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేశారు. జనవరి 6వ తేదిన 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది.ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్లపై ప్రశంసలు కురిపించారు.
నితిన్ గడ్కరీ–అసాధ్యాన్ని సుసాధ్యం:- NHAI, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సాధించిన రికార్డులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ‘మన ఇంజినీర్లు, అధికారులు కలసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విజయం సాధించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నూతన సాంకేతికతతో నాణ్యమైన రహదారుల నిర్మాణం జరగడం గొప్ప విషయం. తక్కువ సమయంలో వేగంగా రహదారుల నిర్మాణం పూర్తిచేశారు. నాణ్యత విషయంలో రాజీలేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతోంది’ అని ప్రశంసించారు.
చంద్రబాబు-10,655 మెట్రిక్ టన్నులు:- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ‘బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన అధికారులందరినీ అభినందిస్తున్నాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ చితపరిచితమే. రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయిలో ఈ రికార్డును సాధించటం గర్వకారణం.10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారు’ అని అన్నారు.
100 కిలోమీటర్లు తగ్గుతుంది:- 24 గంటల్లో అత్యధికంగా 10 వేల 655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరంగా వేసి మూడో రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు నెలకొల్పడం కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లు, అత్యాధునిక సెన్సార్ పేవర్లను వినియోగించింది. మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డును సృష్టించింది. నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే బెంగళూరు-విజయవాడ మధ్య 100 కిలోమీటర్లు తగ్గుతంది. అలాగే సమయం 4 గంటల సమయం తగ్గనుంది.

