AP&TG

డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు

హైదరాబాద్: రోజు రోజుకు మావోయిస్టులు బలహీన పడుతున్నారు. ఇటీవల కాలంలో ఏపిలో మావోయిస్టు అగ్రనేతలు పోలీసుకు పట్టుబడి పోవడంతో,మావోయిస్టు క్యాడర్ లో నమ్మకం పూర్తిగా సడలిపోయినట్లు కన్పిస్తొంది. ఈ నేపధ్యంలో శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్బంలో డీజీపీ శివధర్​ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కాగా మిగతా వాళ్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. కుమురం భీమ్‌ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు సెంట్రల్ విజన్‌ కమాండర్లు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని డీజీపీ తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం, కీలక నాయకులే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు.

సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన అజ్ఞాత కేడర్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. తీసుకొచ్చిన ఆయుధాల్లో ఒకటి ఎల్​ఎంజీ, 3 ఏకే 47 రైఫిల్స్, 5 ఎస్​ఎల్​ఆర్​ రెఫిల్స్, 7 ఇన్​సాస్​ రైఫిల్స్, 1 బీజేఎల్​ గ్రానైడ్​ లాంఛర్, నాలుగు 303 రైఫిల్స్, ఒకటి సింగిల్​ షాట్ రైఫిల్స్, 2 ఎయిర్​ గన్స్​తో కలుపుకుని మొత్తం 24 ఆయుధాలతో లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ. 1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు తెలిపారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు, ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్‌లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్సైన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *