విఆర్సీ తరహాలో 15 మున్సిపల్ హైస్కూళ్ల అభివృద్ధి-మంత్రి నారాయణ
మూడునెలల్లో చింతారెడ్డిపాలెం వద్ద….
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 15 మున్సిపల్ హైస్కూళ్లను విఆర్సీ స్కూల్ తరహాలో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
సోమవారం నగరంలోని కర్నాలమిట్ట మున్సిపల్ హైస్కూల్, బీవీఎస్ హైస్కూల్, చిన్నబాలయ్య హైస్కూల్, వైవిఎం మున్సిపల్ మున్సిపల్ హైసూళ్లను సందర్శించారు. ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విఆర్‌సి స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభించామని, అదేతరహాలో నెల్లూరునగరంలోని 15 కార్పొరేషన్ హైస్కూళ్లను అభివృద్ధి చేసి వచ్చే జూన్ 12లోగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ 15 హైస్కూళ్లలో ఒకటి నుంచి పదోతరగతి వరకు తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ డిసెంబరు నాటికి ఈ స్కూల్స్ లో చదివే పిల్లలకి నారాయణ కాంపిటీటివ్ మెటీరియల్ ఇచ్చి బాగా చదివి మంచి మార్కులు సాధించేలా శిక్షణ ఇస్తామన్నారు. స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చిన దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, మున్సిపల్ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మూడునెలల్లో చింతారెడ్డిపాలెం వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం:- చింతారెడ్డి పాలెం జాతీయ రహదారి కూడలి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, మూడు నెలల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పనులు ప్రారంభమైన ఒక సంవత్సరం లోపు అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు

