ఉగ్రవాదులు ఫ్యాక్టరీగా ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీ
అమరావతి: ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్రకుట్రకు, ఈ పేలుడుతో లింక్ ఉండటం.. ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే (2025-జనవరి 26) రోజున ఎర్రకోట లక్ష్యంగా దాడికి ప్లాన్ చేశామని నిందితులు వెల్లడించారు. జనవరి మొదటివారంలో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు. తాను, డాక్టర్ ఉమర్ నబీ కలిసి రెక్కీ చేశామని దిల్లీ పేలుడు కేసు నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ గనీ పోలీసులకు తెలియజేశాడు. ఈ సమాచారాన్ని తొలుత డాక్టర్ ముజమ్మిల్ గనీ మొబైల్ ఫోన్ డంప్ డాటా నుంచి పోలీసులు సేకరించారు. దీనిపై అతడిని ప్రశ్నించగా, ఆ వివరాలను ధ్రువీకరించాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున కుదరనందున, వచ్చే జనవరి 26న దాడి చేయాలని నిర్ణయించామన్నాడు. ఈ సంవత్సరం దీపావళి రోజున కూడా దిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక సోమవారం రోజే హరియాణాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ ఘనీ, డాక్టర్ షాహీన్ సయ్యిద్లను అరెస్టు చేశారు. అక్కడి నుంచి 360 కేజీల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నట్లు గుర్తించారు.

