బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లలో 10thలో వంద శాతం రిజల్ట్ రావాల్సిందే-మంత్రి సవిత
తిరుపతి: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో వంద శాతం మేర ఫలితాలు రావాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇందుకోసం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ క్లాస్ లు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం తిరుపతిలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నెల రోజుల్లో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా, పరీక్షలకు సిద్ధమయ్యేలా సన్నద్ధం చేయాలన్నారు. పాఠాలపై అవగాహన కలిగేలే బోధించాలన్నారు. మెటీరియల్ అందజేయాలని, వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టుకునేలా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా పదో తరగతిలో ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు.