AP&TGOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్ లో రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన..

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,14,824 కోట్ల  పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు:- విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ జరిగిన 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి:- తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నామని అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకూ ఒక ఆర్ధిక ప్రగతి రీజియన్‌ను , నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.

NIPB సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్‌తో పాటు సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *