ఒకే సారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సముదాయంను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి,సీ.ఎంలు
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, భక్తుల కోసం నిర్మించిన నూతన వసతి సముదాయం వేంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్సు-5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా తిరుమల వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఒకే సారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా దీన్ని సిద్ధం చేశారు. 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్-5ను తీర్చిదిద్దారు. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఈ పీఏసీ-5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ వసతి సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి సీఎం చంద్రబాబు భవనాన్ని పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్లోకి వెళ్లిన సీఎం, ఉపరాష్ట్రపతి బుకింగ్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఓ భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్‌ను సీఎం చంద్రబాబు అందించారు.
లడ్డు ఏఐ ఆధారిత సాంకేతికతతో:- తిరుమల పోటులో ప్రసాదం తయారీ కోసం వినియోగించేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతతో అందుబాటులోకి తెచ్చిన కొత్త సార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ యంత్రాల సాయంతో ప్రసాదంలో నాణ్యత పెంచడంతోపాటు… తక్కువ సమయంలో ఎక్కువ ప్రసాదాన్ని సిద్దం చేసే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు.
ఏ.ఐ టెక్నాలజీతో గంటకు 5500 మంది వరకూ భక్తులు:- శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వైకుంఠం క్యూకాంప్లెక్సులో నూతనంగా నిర్మించిన అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4500 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో వేంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షణలో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, గంటకు 5500 మంది వరకూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.