కులం ఎవరిదీ మారిపోదు,శాశ్వత ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇవ్వాలి -సీ.ఎం చంద్రబాబు
2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో…
అమరావతి: అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం మేర ఆర్ఓఆర్ కు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, భూములు ఇలా వేర్వేరు అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వపాలకులు భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరి చేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాలి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు.
కులం ఎవరిదీ మారిపోదు దానిని శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలి. నివాస, వయో ధృవీకరణ కోసం ప్రతీ ఏటా జారీ చేయొచ్చు. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం.

