అమరావతిలో ఐటీ కంపెనీ ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’ ప్రారంభం
300 మందికి ఉద్యోగాలు..
అమరావతి: అమరావతిలోని మరో ఐటీ కంపెనీ ప్రారంభం అయింది.కేసరపల్లి ఏపీఐఐసీ- ఏస్ అర్బన్ హైటెక్ సిటీలోని మేథ టవర్ ఒకటవ అంతస్తులో బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సీఈవో సౌరి గోవిందరాజన్ వెల్లడించారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 300 ఉద్యోగాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాన్‌బ్లాక్ కంపెనీ ఫార్మా, హెల్త్, ఆటోమేటివ్, రిటైల్, ఆహార రంగాల్లో సేవలందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో తెలిపారు. వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా మారిన బ్లాక్ చైన్ కంపెనీలలో బాన్‌బ్లాక్ సంస్థ మొదటి పది సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అమెరికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న బాన్‌బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించడం సంతోషంగా ఉందనన్నారు. సంస్థ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం మరువలేనివన్నారు. ఈ కంపెనీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ ప్రాజెక్టుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికర సేవలందిస్తామన్నారు.
‘స్పాట్ బస్ ఐవోటీ డివైజ్:- స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ రూపొందించిన ‘స్పాట్ బస్ ఐవోటీ డివైజ్’ను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టీసీ బస్సుల్లో అమరుస్తున్నట్లు సీఈవో గోవిందరాజన్ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో సీ.ఎం చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించే బస్సుల్లో ఈ డివైజ్ లు పని చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పరికరాల ద్వారా ఆర్టీసీ బస్ కదలికలను ప్రత్యేకంగా అమర్చిన 360 డిగ్రీల కెమెరా ద్వారా రియల్ టైమ్ లో పర్యవేక్షణకు ఆ డివైజ్ లు ఉపయోగపడతాయన్నారు. నిఘా, అత్యవసర సేవలు, భద్రత, బస్సు నిర్వహణకు అవసరమైన డేటా మేనేజ్ మెంట్ విషయంలో పరికరాలు సహకారిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బాన్‌బ్లక్ సంస్థకు చెందిన కార్పొరేట్ సర్వీసెస్ డైరెక్టర్ జమునాదేవి దయానిధి, పబ్లిక్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ సాయిరాం పాల్గొన్నారు.