డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్త, ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోస్టుల్లో అగ్రనేతలు ఉన్నారు. మావోయిస్టు పార్టీలో దాదాపు 34 ఏళ్లకు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్, ఆయన భార్య అరుణ అలియాస్ మేదక జ్యోతీశ్వరి ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వీరు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా ముందు శనివారం లొంగిపోయారు.
ఈ సిద్ధాంతం ఇక మందు పనికి రావని:- ప్రస్తుతం కమలేశ్ తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జిగా పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎస్‌జెడ్‌సీఎం హోదాలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది ఈ సిద్ధాంతం ఇక మందు పనికి రావని గ్రహించి లొంగిపోయారని అధికారులు తెలిపారు. ఆయన భార్య అరుణ, మొబైల్ అకడమిక్ పాలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్‌కి ఇన్ఛార్జ్‌గా పనిచేస్తూ అదే విధంగా పార్టీ వైఫల్యాల పట్ల నిరాశ చెందారని పేర్కొన్నారు. కమలేశ్‌పై ఏపీలో 20 లక్షల రూపాయల రివార్డు, అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను డీజీపీ అందజేశారు.
భారీగా అయుధాలు స్వాధీనం:- అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు గత వారంలో రికవరీ చేసిన ఆయుధాలను ఏపీ డీజీపీ హరిశ్ కుమార్ గుప్తాకి అధికారులు చూపించారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి. ఏకే-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, రాకెట్ లాంచర్లు,,అత్యాధునిక వాకీటాకీలు, హ్యాండ్ గ్రానైట్లు, పేలుడు పదార్థాలు ఇతర పరికరాలను ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఈ మధ్య లొంగిపోయిన మడకం దేవా అలియాస్ భగత్ (డివిజనల్ కమిటీ సభ్యుడు)కి సంబంధించినవా భావిస్తున్నారు..ఇటీవల లొంగిపోయిన 13 మంది యూజీ కేడర్‌కు రూ.22 లక్షల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు. గత ఏడాది కాలంలో మొత్తం రూ.64 లక్షల రివార్డులను వివిధ హోదాల్లో లొంగిపోయిన 48 మంది కేడర్‌కు అందజేశారు.
ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు:- ఈ సందర్భంగా డీజీపీ హరిశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఏపీలో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయనీ, ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేశ్ ఉన్నారని చెప్పారు. అలాగే వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఏడుగురు యూజీ కేడర్ అరెస్ట్ కాగా, 40 మంది యూజీ కేడర్ లొంగిపోయారని చెప్పుకొచ్చారు. మావోయిస్టు యూజీ కేడర్ లొంగిపోవాలని డీజీపీ కోరారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఏపీ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారి పై ఉన్న రివార్డ్ తో పాటు, ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని, అందులో ఐదు మంది ఎస్‌జెడ్‌సీఎం హోదాలో ఉన్నారని చెప్పారు.

