అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ సెంటర్ దేశానికి ఓ దిక్చూచి-ఐబీఎం సంస్థ డైరెక్టర్
జనవరి 2026 నాటికీ..
అమరావతి: అమరావతిలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభమవుతుందని, ఏపీతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, ఆగ్రిటెక్, మెడ్ టెక్ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు వినియోగించుకోవచ్చని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు.బుధవారం క్వాంటమ్ వ్యాలిపై జూన్ 30న నిర్వహించేబోయే జాతీయస్థాయి వర్క్ షాప్ లో అయన మాట్లాడారు.
ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘే మాట్లాడుతూ, అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు దేశంలో ఓ కీలకమైన పరిణామమని, భవిష్యత్తులో లాజిస్టిక్స్ , స్పేస్ , ఔషధరంగం, విద్య, వైద్యం, ఫైనాన్షియల్ , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలకం కానుందని తెలిపారు. 2029 నాటికి స్టార్లింగ్ అనే ఓ భారీ స్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టంను ఐబీఎం రూపోందిస్తోందని, ఇందులో భాగంగానే లాజికల్ క్యూబిట్స్ కంప్యూటర్స్ ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు.
నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లు పరిశోధన సాగిస్తున్నాయని, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థలు కూడా క్వాంటం కంప్యూటర్లను వినియోగిస్తున్నయన్నారు. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ వినియోగం చేయొచ్చని వివరించారు. స్టాక్ మార్కెట్ , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతోందని, దీని వలన విద్య సంస్థలతో పాటు పరిశ్రమలకు ప్రయోజనకారిగా మారుతుందని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ సెంటర్ దేశానికి ఓ దిక్చూచిగా మారుతుందని ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు మాట్లాడుతూ, బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా జరిగే ఆర్ధిక లావాదేవీల పర్యవేక్షణ, వరుస సంఖ్యల జారీ లాంటి అంశాలు, లాజిస్టిక్స్, సప్లై చైన్ , మాన్యుఫాక్చరింగ్, హెల్త్ కేర్ , రోబోటిక్స్ లాంటి అంశాల్లో క్వాంటం, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ లాంటి ఆధునిక టెక్నాలజీల వినియోగం గురించి చర్చ జరుగుతోందన్నారు. రిస్క్ ఎనాలిసిస్ , క్లైమేట్ చేంజ్, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ లాంటి అంశాలకు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తరిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా క్వాంటం టెక్నాలజీ వినియోగం ఇప్పుడు ఓ కీలకమైన అంశంగా మారిందన్నారు. ఐఐటీలు, యూనివర్సిటీలు పరిశోధన సాగిస్తున్న వివిధ అంశాల్లోనూ క్వాంటం కంప్యూటింగ్ వినియోగం చేయాల్సిన అవసరం ఉందని, అమరావతి లో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ సెంటర్ లో ఐబీఎం, టీసీఎస్ లతో కలిసి ఎల్ టీఐ మైండ్ ట్రీ కూడా భాగస్వామ్యం వహిస్తోందని విజయరావు తెలిపారు.

