67 లక్షల మంది విద్యార్ధులకు ‘తల్లికి వందనం’-సీ.ఎం చంద్రబాబు
రౌడీ మూకతో పొదిలి వెళ్లి జగన్ రౌడీయిజం..
అమరావతి: ‘ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నాం. నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా హామీని అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీల్లో ఈ పథకం కీలకమైంది. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తాం. తల్లికి వందనం పథకం.. అమ్మఒడి పథకానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్ధులకు అమ్మఒడి ఇచ్చారు… మా ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్ధులకు ఇస్తోంది. అంటే గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపచేశాం. గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు ఇవ్వగా… మేం రూ.8,745 కోట్లు జమ చేస్తున్నాం. వారికంటే రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, స్కూలు అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని వివరించారు. తల్లి లేని పిల్లలుంటే తండ్రి, సంరక్షులకు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదు జమ చేస్తామన్నారు. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో చదివే 76 వేల మందికి కూడా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. దీనికోసం ఈ నెల 26 వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నా మంచి తనమే ఇప్పటిదాకా చూశారు.. ఇక ఉపేక్షించను:- ‘ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది చాలక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శిస్తారా.? పొదిలికి గూండాలను తీసుకెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీయజం చేస్తారా.? శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ప్రజల భద్రత విషమయంలో రాజీపడను. రౌడీయిజం చేసి పెత్తనం చేయాలంటే ఆటలు సాగనివ్వను. ఇప్పటివరకూ నా మంచితనం చూశారు. ఇకపై ఉపేక్షించను’ అని సీఎం చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.

