రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు,ఈదురుగాలులు-ఎ.పి.ఎస్.డి.ఎం.ఎ
అమరావతి: నైరుతి ఋతుపవనాలు బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు నేపధ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామన్నారు.
గురువారం:- శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం:- అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

