గుండెపోటుతో తమిళ దర్శకుడు భాగ్యరాజ్ మృతి
అమరావతి: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయినట్లు సమాచారం. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన మరణ వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో విషాదంలో ఉన్న తమిళ చిత్ర పరిశ్రమకు, ఇప్పుడు కె. భాగ్యరాజ్ మరణం తీరని లోటుగా మారింది. ప్రత్యేకమైన కథలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, వినోదాత్మక కథనాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న భాగ్యరాజ్ ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కె. భాగ్యరాజ్‌కి భార్య పూర్ణిమ జయరామ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు-నటుడు శాంతను భాగ్యరాజ్ ఉన్నారు.

