AP&TG

విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు-రాష్ట్ర ఎన్నికల కమిషనర్

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు..

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

అమరావతి: ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా శనివారం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు), పోలీసు కమిషనర్లను తక్షణమే అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

చట్టప్రకారం కఠిన చర్యలు:- ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం:- నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు అనుమతించిన కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలులో ఎలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

సస్పెన్షన్ లేదా బదిలీ వంటి క్రమశిక్షణా చర్యలు:- ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో గానీ, శాంతిభద్రతల పరిరక్షణలో గానీ అధికారులు నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని అనిల్ చంద్ర పునేఠా హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన అధికారులపై నిబంధనల ప్రకారం సస్పెన్షన్ లేదా బదిలీ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఐజీ (IG) బి. రాజకుమారి:- ఐజీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం లో డిప్యూట్ కాబడిన (IG) బి. రాజకుమారి మాట్లాడుతూ..ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్రిటికల్, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిధిలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్. ఏ. మల్లిఖార్జున పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *