ప్రపంచ సెమీకండక్టర్ సప్లై చైన్ లో భారత్ ప్రవేశం-ప్రధాని మోదీ
అమరావతి: ప్రపంచ సెమీకండక్టర్ సప్లై చైన్ లో భారత్ తన పాత్రను బలోపేతం చేసుకుంటుందని, గుజరాత్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ఓశాట్ కేంద్రాన్ని ప్రారంభించడం భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థకు గర్వకారణం అని ప్రదాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఓశాట్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రదాని మోదీ ప్రసంగిస్తూ ఇది భవిష్యత్ సాంకేతికతలు,ఆవిష్కరణలలో అగ్రగామిగా ఎదగాలన్న భారతదేశ ప్రయత్నాలకు మరింత ఊపునిస్తుందని అన్నారు. భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతూ, వేల సంఖ్యలో యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తోందని, ఈ ప్రాజెక్టును మరింత విస్తృతం చేసేందుకు సెమీకండక్టర్ మిషన్ 2.0 పై పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతికత, ఏఐ, సెమీకండక్టర్ల రంగాలలో భారత్ చేపట్టిన అవిష్కరణలు యావత్ ప్రపంచానికి ప్రయోజనం కలుగచేస్తుందన్నారు. దేశంలోని ప్రతి ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా గత బడ్జెట్లో తాము సెమీకండక్టర్ మిషన్ 2ను ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.21వ శతాబ్దపు మార్పులకు భారత్ కేవలం ఒక సాక్షిగా కాకుండా, ఆ మార్పునకు నాయకత్వం వహించే సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. మైక్రాన్ ప్లాంట్ తర్వాత దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండో అతిపెద్ద సెమీకండక్టర్ యూనిట్. దాదాపు రూ.3,300 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్, చిప్‌ల తయారీలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించనుంది.
రోజుకు 63.3 లక్షల యూనిట్ల ఉత్పత్తి:- ప్రధానంగా అడ్వాన్స్ డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్-‘ఐపీఎం’లను తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక మోటార్ డ్రైవ్‌లు, గృహోపకరణాల్లో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి ఈ ఐపీఎంలు ఎంతో కీలకం. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లకు అవసరమైన కాంపాక్ట్, రిలయబుల్ పవర్ స్విచింగ్ సెమీకండక్టర్లను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి రోజుకు 63.3 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరగనుంది. భారత చిప్ ఎకోసిస్టమ్‌లో ఉన్న అంతరాన్ని పూరించడమే కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్‌లో భారత్ కీలక శక్తిగా ఎదగడానికి ఈ ప్లాంట్ దోహదపడనుంది.

