సౌంకేతిక ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పరస్పరం వాణిజ్యం చేసుకోవడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా ఏర్పరచుకుంటాయి. ఉమ్మడి ప్రయోజనాలే కాకుండా ఉమ్మడి దృక్పథం ఆధారంగా నడిచే సంబంధాలు చాలా తక్కువగా వుంటాయని అయితే భారత్-ఫ్రాన్స్ సంబంధాలు అటువంటి వాటిలో ఒకటని ప్రధాన మంత్రి నరనేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో ఆదివారం నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని, దేశంలో స్టార్టప్ విప్లవం కొనసాగుతోందన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేస్తోందన్నారు. ఆ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మోదీ తెలిపారు.
నేటి యువ పారిశ్రామికవేత్తలు భారత భవిష్యత్తుకు ప్రతీక.వారి ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి నవ భారతానికి అద్దం పడుతున్నాయి. గ్రామీణ జీవితాన్ని కృత్రిమ మేధ ద్వారా మార్చేలా అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, కృత్రిమ మేధ రంగం, భద్రత, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు వెతుకుతున్నాయన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. సౌంకేతిక ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందని ప్రశంసించారు. భారతదేశం, విద్య, పరిశోధన,సాంకేతిక శిక్షణ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. ఏటా 10 లక్షల మందికి పైగా ఇంజినీర్లను తయారుచేస్తూ ప్రపంచ సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ సాధించిన విజయాలు.. ఆ దేశ సామర్థ్యానికి నిదర్శనమన్నారు.

