సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజు నోటీసు జారీ-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయకుండా, గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని, ప్రణాళికాబద్ధంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. స్థానిక 2 వ డివిజన్ పరిధిలోని 4 సచివాలయాలకు సంబంధించిన సిరి గార్డెన్, నరుకూరు, ఎస్. ఎల్. వి. రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లో పార్కుల నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్ చేయించాలని ఆదేశించారు. గుడిపల్లిపాడు ప్రాంతంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి స్థానికులందరికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు. నరుకూరు సమీపంలో అనధికార భవనం నిర్మాణం చేస్తుండటాన్ని గమనించిన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్థానిక వార్డు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజు నోటీసు జారీ చేయమని ఆదేశించారు. గుడిపల్లిపాడు డ్రైను కాలువల నిర్మాణాలను వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మొదలుపెట్టని కారణంతో ఇంచార్జ్ ఏ.ఈ కి, స్థానిక వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శకి షో కాజు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. స్థానికంగా ఉన్న ప్రధాన పంట కాలువకు సంబంధించిన సమస్యలను పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా సచివాలయ సిబ్బంది, అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్, నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.