AP&TG

వృద్ధాప్యంలోకి తెలుగు రాష్ట్రాలు-హెచ్చరిస్తూన్న ఆర్బీఐ లెక్కలు

అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘స్టేట్ ఫైనాన్సెస్-ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26’ నివేదిక తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై ఆందోళనకరమైన నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా దేశంలోనే అత్యంత యువ రాష్ట్రాలుగా పేరున్న తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోందని ఆర్‌బీఐ హెచ్చరించింది.

పెరగనున్న పెన్షన్లు.. తగ్గనున్న శ్రామిక శక్తి:- ఈ మార్పు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం పనిచేసే ప్రతి 100 మందిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య 16గా ఉంటే, 2036 నాటికి అది 26కు పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై పెన్షన్ల భారం, ఆరోగ్య రక్షణ ఖర్చులు భారీగా పెరుగుతాయి. మరోవైపు, పనిచేసే వయసున్న జనాభా తగ్గిపోవడం వల్ల పన్ను వసూళ్లు మందగించే ప్రమాదం ఉంది. సంతానోత్పత్తి రేటు 1.5 కి పడిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 శాతం కంటే చాలా తక్కువ.

దారుణమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్‌:- తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మరింత వేగంగా ముసలితనంలోకి జారుకుంటోంది. APలో వృద్ధుల జనాభా 2026లో 14.1% నుంచి 2031లో 16.4%కి పెరుగుతుందని మరియు 2036 నాటికి 18.9%కి పెరుగుతుందని అంచనా.

పదేళ్లలో వృద్ధ రాష్ట్రంగా తెలంగాణ:- ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం మరో పదేళ్లలో ఏజింగ్ స్టేట్ జాబితాలోకి చేరనుంది.2016లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య కేవలం 10.1 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 12.5 శాతానికి చేరింది. ఇదే వేగం కొనసాగితే 2036 నాటికి రాష్ట్ర జనాభాలో 17.1 శాతం మంది వృద్ధులే ఉంటారని ఆర్‌బీఐ విశ్లేషించింది. అంటే, ప్రతి ఆరుగురిలో ఒకరు వయోధికులు ఉండబోతున్నారు.

నిపుణులు ఆందోళన:- దేశంలో అత్యధిక వృద్ధులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలవనున్నాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ దశకు చేరుకోగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. యువత సంఖ్య తగ్గుతుండటం వల్ల భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా మేల్కొంటారా:-  తెలుగు రాష్ట్రాలు డెమొగ్రాఫిక్ డివిడెండ్ ను వాడుకోవడానికి ఈ దశాబ్దమే చివరి అవకాశమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. యువతకు సరైన నైపుణ్య శిక్షణ , ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంచే సంస్కరణలు చేపట్టడంలో ఆలస్యం జరిగితే.. భవిష్యత్తులో పెరగనున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చడం ప్రభుత్వానికి పెను భారంగా మారుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *