భవన నిర్మాణ అనుమతులు30 రోజుల్లో-నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్-హోంమంత్రి అనిత
అమరావతి: శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ,అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావటంతో మార్పులు అవసరమైనట్లు చెప్పారు. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టంలో సవరణ చేసినట్లు తెలిపారు. వాణిజ్య, పారిశ్రామిక, నివాస భవనాలకు ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి చేస్తున్నామన్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో అత్యవసర మార్గాలు, అగ్నిమాపక పరికరాలతో పాటు తగిన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత పేర్కొన్నారు. సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, ఆధునిక రక్షణ విధానాలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. భవన నిర్మాణ అనుమతులు 21 నుంచి 30 రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవన ప్రాంగణాన్ని సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు.

