AP&TG

నాలా చట్టం రద్దు…ట్యాక్స్ కూడా తగ్గింపు-మంత్రివర్గ ఉపసంఘం

అమరావతి: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ర్ట ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని, దీన్ని గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నాలాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టేస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా  విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎవరైనా ఏదైనా మున్సిపాల్టీలో వెంచర్ వేస్తే వారికి భూ మార్పడి ఎలా చేయాలి, ఎవరైనా పరిశ్రమ పెడితే వారికి భూ మార్పడి అత్యంత సులభంగా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఎలా చేయాలో  ప్రతిపాదనలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తదుపరి సమావేశంలో అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయించిన విధివిధానాలను మంత్రివర్గం ముందు పెడతామని చెప్పారు. అనంతరం రాష్ర్ట పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నాలా ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉందని పలు సంఘాల నుండి అభ్యంతరాలు వచ్చాయని, ఆ ట్యాక్స్ ను కూడా ఎంతమేరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీలైతే ఈ ప్రతిపాదనలను ఈనెల 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో మూడోసారి భేటి అయ్యింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *