జల్ జీవన్ లక్ష్యాలు చేరుకునేందుకు మరింత సాయం అవసరం-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కేంద్ర జల్ శక్తి శాఖకు ఉపముఖ్యమంత్రి వినతి..
జల్ జీవన్ మిషన్ 2.0 మధ్య అవగాహన ఒప్పందం..
అమరావతి: ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటికీ తాగు నీరు అందించాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అవసరం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలియ చేశారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందనీ, వారు సమర్పించిన DPR రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ మరో 13 లక్షల ఇళ్లు జల్ జీవన్ మిషన్ MoUలోని ఆర్టికల్ 1 లక్ష్యాలకు దూరంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో కేంద్ర ప్రభుత్వం తరఫున జల్ శక్తి మంత్రిత్వశాఖ నుంచి తాగు నీరు-పారిశుధ్య విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీమతి స్వాతి మీనా నాయక్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచయతీరాజ్ గ్రామీణాభివృద్ధి-గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ MoUపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సూచించింది.

